డెహ్రాడూన్: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అవకతవకల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు నోరు మెదపటం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రశ్నించారు. శనివారం డెహ్రాడూన్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘రాఫేల్ ఒప్పందంపై మాట్లాడమని డిమాండ్ చేసిన పార్లమెంటులో మోదీ నోరు విప్ప లేదు. దీని గురించి మాట్లాడే ధైర్యం ఆయనకు లేదు. కాపలాదారుడే దొంగ. దేశంలో వ్యవసాయ సంక్షోభం ఉంది. ఇటీవల జరిగిన మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే మేము రైతు రుణ మాఫీ చేశాం. గత ఎన్నికల ముందు మోదీ చాలా హామీలు ఇచ్చారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్నారు. కానీ, ఇవేవీ జరగలేదు’ అని ధ్వజమెత్తారు. ‘పెద్ద నోట్ల రద్దు వల్ల ఉత్తరాఖండ్‌లోని మహిళలతో పాటు పలు పరిశ్రమలు నష్ట పోయాయి. వస్తు సేవా పన్ను వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్‌ను ఎవరికీ ఇబ్బందులు కలగని రీతిలో సరళీకృతం చేస్తాం. గత ఐదేళ్లలో దేశంలోని రైతులు, యువత మేలు కోసం మోదీ ఏమీ చేయ లేదు. పంటలకు కనీస మద్దతు ధరను పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. రైతులకు అందాల్సిన నిధుల్ని పారిశ్రామిక వేత్తల జేబుల్లోకి మళ్లించారు. నీరవ్ మోదీ కోట్లాది రూపాయలతో ఫరారయ్యాడు. ఆయనను తిరిగి రప్పించే ప్రయత్నాల్ని కేంద్ర ప్రభుత్వం చేయట్లేద‘ని రాహుల్ దుయ్య బట్టారు. ‘2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే దేశంలోని పేదలకు ప్రయోజనాలు చేకూర్చాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. మేము కనీస ఆదాయ భరోసాను కల్పిస్తాం. దేశంలోని ప్రజలను పేద, ఉన్నత వర్గాలుగా విభజించడానికి భాజపా ప్రయత్నిస్తోంది. ఆ అవకాశాన్ని మేము ఇవ్వము. కొందరికి మాత్రమే ప్రయోజనాలు చేకూరేలా మోదీప్రభుత్వాన్ని నడుపుతున్నారు. భారత్ తన వల్లే అభివృద్ధి చెందు తుందని ఆయన చెప్పుకుంటున్నారు. ఆయన ప్రధాని కాక ముందు దేశం అభివృద్ధి చెందలేదా? రోడ్లు, భవనాల నిర్మాణాలు జరగలేదా? దేశ అభివృద్ధిలో మనందరికీ భాగస్వామ్యం ఉంద’న్నారు.