
డెహ్రాడూన్:భారతీయ జనతా పార్టీకి ఉత్తరాఖండ్లో ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్య మంత్రి బీసీ. ఖండూరి తనయుడు మనీష్ ఖండూరి శనివారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. మనీష్ ఖండూరిని పార్టీలోకి రాహుల్ ఆహ్వానించి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. రాహుల్ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని, దేశ పటిష్టత కాంగ్రెస్తోనే సాధ్యమని మనీష్ ఖండూరి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు తన తండ్రి ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. పవురి లోక్సభ నియోజకవర్గం నుంచి మనీష్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.