న్యూఢిల్లీ : సైనిక సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నాడనే అనుమానంతో ఐఎస్‌ఐ ఏజెంట్‌గా భావిస్తున్న ఫజాలికా ప్రాంతానికి చెందిన రామ్ కుమార్ అనే వ్యక్తిని జలంధర్‌లో పోలీసులు శుక్రవారం బంధించారు. నిందితుడి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, నాలుగు సిమ్‌లు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు ఆశ పడి ఇండో – పాక్ సరిహద్దులో భారత సైన్యానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు అందిస్తానని చెప్పాడన్నారు. సరిహద్దుల్లో భారత జవాన్ల కదలికల పైనా నిందితుడు నిఘా వేసేవాడని చెప్పారు. జమ్మూ- కశ్మీర్ సైనిక ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి అందిన సమాచారం మేరకు అతడి కదలికలను పసి గట్టి స్ధానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం తదుపరి విచారణ కోసం నిందితుడిని పోలీసులు చండీగఢ్‌కు తరలించారు.