ఢిల్లీ : వింగ్ కమాండర్ అభినందన్ కొన్ని వారాల పాటు సెలవుపై వెళుతున్నట్లు భారత వైమానిక దళం అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభినందన్‌కు అన్ని వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, డాక్టర్ల సలహా మేరకు ఆయన సెలవుపై వెళుతున్నారని పేర్కొన్నారు. ఆయన వైద్య నివేదికలు ఇంకా తమకు అందలేదని, అవి రాగానే విధుల్లో ఎప్పుడు చేరాలో చెబుతామని వెల్లడించారు. పుల్వమా ఉగ్ర దాడి తర్వాత భారత యుద్ధ విమానాలు పాక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు నిర్వహించిన సందర్భంగా అభినందన్ నడుపుతున్న విమానం పాక్ భూభాగంలో కూలిపోయింది. పాక్ ఆర్మీ అధికారులు ఆయనను తమ అదుపులోకి తీసుకోగా, అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన ఒత్తిడి కారణంగా తదనంతరం ఆయనను విడుదల చేశారు. అప్పటి నుంచి ఆయన ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.