న్యూఢిల్లీ: దైచీ సంస్థకు సింగపూర్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రూ.3,500 కోట్లు ఎలా చెల్లిస్తారని రాన్‌బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు సింగ్ సోదరులు- శివీందర్ సింగ్, మాల్వీందర్ సింగ్‌ను అత్యున్నత న్యాయస్థానం గురువారం ప్రశ్నించింది. దైచీ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ ఆరంభించింది. ‘ఇది కేవలం వ్యక్తుల గౌరవానికి సంబంధించే కాదు దేశ గౌరవానికి కూడా సంబంధించింది. మీరు మందుల తయారీ రంగంలో అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఇలా న్యాయస్థానాలకు రావట మంచిది కాదు. ఆర్థిక నిపుణుల్ని సంప్రదించిన తర్వాత మార్చి 28వ తేదీన మీ ప్రణాళిక సమర్పించండి. మీరు కోర్టుకు రావడం అదే చివరి సారి కావాలి’’ అని వ్యాఖ్యానించింది. సింగ్ సోదరుల నుంచి రూ.3,500 కోట్ల బకాయివసూలు కోసం జపాన్‌కు చెందిన దైచీ సాంకో సంస్థ కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. గతంలో సింగపూర్ ట్రిబ్యునల్ సింగ్ సోదరులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.