బెంగళూరు : మాజీ ప్రధాని హెచ్‌డీ. దేవెగౌడ ఇన్నాళ్లూ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన హాసన లోక్‌సభ స్థానం నుంచి ఈసారి ఆయన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేయనున్నారు. బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో దేవెగౌడ ఈ ప్రకటన చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకు వచ్చానని, తన కుటుంబ సభ్యులను తీసుకు వస్తే ప్రత్యర్థులు తప్పులు వెతుకుతున్నారని దేవెగౌడ నిష్టూరమాడారు. కాగా ప్రజ్వల్ హెగ్డే తండ్రి హెచ్‌డీ. రేవణ్ణ రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి. ఆయన సోదరుడు, ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ ఈసారి మండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి సినీ నటి సుమలత అంబరీశ్ ఆసక్తి చూపగా పార్టీ నిరాకరించింది. పొత్తులో భాగంగా జేడీఎస్ సిట్టింగ్ స్థానమైన మండ్యను ఆ పార్టీకే వదిలేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. కాగా దేవెగౌడ బెంగళూరు ఉత్తర లేదా మైసూరు స్థానం పోటీ చేయవచ్చని తెలుస్తోంది.