అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌లో జరగనున్నసార్వత్రిక ఎన్నికలు ఆత్మాభిమానానికి, అరాచకానికి మధ్య సాగే పోరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. సోమవారం ఉదయం ఆయన తెదేపా నేతలతో ఇక్కడి నుంచి టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ‘మీ భవిష్యత్తు – మా బాధ్యత’ నినాదంతో ఎన్నికల ప్రచార భేరీ మోగించాలని పిలుపు నిచ్చారు. ‘‘యుద్ధంలో గెలుపే సిపాయిల లక్ష్యం. ఎన్నికల్లో గెలుపే తెదేపా కార్యకర్తల ధ్యేయం’’ అని పేర్కొన్నారు. ముప్పయి రోజుల సమగ్ర ప్రణాళికతో ఎన్నికల కదం తొక్కాలని దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్ని సమర్ధంగా ఎదిరించేందుకు అన్ని విధాలా సమాయత్తంగా ఉన్నామన్నారు. ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరు అవిశ్రాంతంగా పని చేయాలని కోరారు. ఎన్నికల క్రతువు ముగిసేంత వరకూ ఎవరికీ సెలవులు లేవని, ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవని, ఒక్క నిమిషం కూడా వృధా చేయరాదని హెచ్చరించారు. పార్టీలో విభేదాలకు తావు ఇవ్వకూడదన్నారు. అందరూ పరస్పరం చర్చించుకుని సమన్వయంతో పని చేయాలని సూచించారు. తక్కువ సమయం ఉన్నా సమర్థంగా పని చేస్తామని దీమా వ్యక్తీకరించారు. ఒక నెల ముందే ఎన్నికలు రావడం మంచిదని అభిప్రాయపడ్డారు. మేలో జరగాల్సిన ఎన్నికలను నెల రోజులు ముందుకు తీసుకురావడాన్ని సంక్షోభంగా భావించరాదని, అవకాశంగా మలచుకోవాలని పిలుపు నిచ్చారు. తెలుగుదేశం గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల నమోదు, తొలగింపునకు ఐదు రోజులే గడువు న్నందున ప్రతి రోజూ ఓట్లు తనిఖీ చేసుకోవాలని, తుది జాబితా వరకూ ఆప్రమత్తంగా మెలగాలని సూచించారు విభేదాలకుతావివ్వకుండా పరస్పరం చర్చించుకుని సమన్వయంతో పని చేయాలని కోరారు.
కుతంత్రాలతో
గెలుపునకు జగన్ సన్నాహాలు
వచ్చే ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో గెలిచేందుకు వైకాపా వ్యూహాన్ని రచించిందని ఆరోపించారు. ‘చరిత్రలో కుట్ర దారులు గెలిచిన దాఖలాల్లేవు. ధర్మాన్ని ఏమార్చడం ఎవరి వల్లా సాధ్యం కాదు. సత్యానికి ఉన్న శక్తి గొప్పది. ధర్మ పోరాటంలో తెదేపాదే అంతిమ విజయం’ భరోసా వ్యక్తీకరించారు. ‘ జగన్ కరుడు గట్టిన నేర గాడు. ఆయన్ని నమ్మితే జైలుకు పోవటం ఖాయం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది మొత్తం నేర చరిత్ర . ఏమాత్రం ఏమరపాటుగా ఉండరాదు. ఎన్నికల్ని ఎదిరించేందుకు ఎంత సన్నద్ధంగా ఉన్నా అవతలి వారిది నేర చరిత్ర కలిగిన పార్టీ అని గుర్తించి మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ‘మిమ్మల్ని జైలుకు పంపే భరోసా నాదీ’ అనే నినాదంతో జగన్ ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పటికే చాలా మందిని ఆయన చెరసాల పాల్జేసినందున ప్రజలు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకుంటారని తెలిపారు. ‘ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకాల్సిన అవసరం లేదు. కేసీఆర్‌కు మనకు ఉన్న తేడా అదే న’నివ్యాఖ్యానించారు. దుర్మార్గంగా మాట్లాడితే నోరు మూయించే సత్తా ఉందని, తాము చేత కాని వాళ్లం కాదని హెచ్చిరించారు. ‘నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ను దొంగతనంగా అనుభవిస్తూ కుట్రలు పన్నే స్థాయికి దిగ జారారని’ కేసీఆర్‌ను ఉద్దేశించి దుయ్యబట్టారు. . ప్రస్తుత సంక్షేమ పథకాలు అమలు కూడా ఆపివేయించి ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.