లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్లకు పైగా
కుచ్చు టోపీ పెట్టి, విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్‌లో
విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. లండన్ వీధుల్లో తిరుగుతూ అతను టెలిగ్రాఫ్ రిపోర్టర్
కంటబడ్డాడు. ఆ వీడియోను టెలిగ్రాఫ్ పత్రిక తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది.
ఏ మాత్రం భయం లేకుండా తిరుగుతున్న అతనితో మాట్లాడేందుకు రిపోర్టర్ ప్రయత్నించగా తప్పించుకోజూశాడు.
అయినా రిపోర్టర్ అతన్ని వదలకుండా వెంబడించాడు. ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే అన్నిటికీ
అతను నో కామెంట్ అని మాత్రమే సమాధానమిచ్చాడు. నీరవ్ తననెవరూ గుర్తు పట్టకుండా ప్లాస్టిక్
సర్జరీ చేయించుకున్నాడు. గడ్డం, మీసాలు పెంచాడు. అతను ధరించిన కోటు విలువ సుమారు రూ.7
లక్షలు ఉండవచ్చని అంచనా. అతను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ అద్దె నెలకు రూ.16 లక్షలట.
లండన్‌లోని వెస్ట్‌ఎండ్‌లో అతను భారీ వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్లు సమాచారం. అతని
కోసం ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు లేదు.