పాముకు పాలు పోసినా…విషమే కక్కుతుందనే నానుడి మరోసారి రుజువైంది. చావుకు దగ్గరైన తనను రక్షించిన ప్రాణ దాతనే ఆ పాము కాటేసి ప్రాణం తీసింది. విజయనగరం జిల్లా బలిజిపేటలో నిన్న చోటు చేసుకుందీ విషాద సంఘటన. ఊర్లోని చిన్న వీధి బజారు సెంటరులో ఉన్న ఓ కూరగాయల దుకాణంలోకి తాచు పాము దూరింది. దానిని చంపడానికి యజమాని ప్రయత్నిస్తుండగా, అప్పుడే అటుగా వచ్చిన అప్పయ్య (46) అడ్డుకున్నాడు. దానిని పట్టుకుని ఊరు బయట వదలడానికి తీసుకెళ్తుండగా చేతిపై కాటేసింది. అయినప్పటికీ అప్పయ్య ఊరి పొలిమేర్లలో దానిని వదిలేసి బలిజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. వైద్యాధికారి చికిత్స చేస్తుండగానే అతను అపస్మారక స్థితికి చేరుకుని తుది శ్వాస విడిచాడు.