జమ్ము: జమ్ము నగర బస్టాండ్లో గురువారం మధ్యాహ్నం సంభవించిన పేలుడులో ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు తెలిసింది. భద్రతా సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు, విస్తృత తనిఖీలు చేపట్టారు. గత 10 మాసాల్లో ఇలాంటి దాడి జరగడం ఇది మూడో సారని పోలీసులు వెల్లడించారు. గ్రనేడ్ తీవ్రత తక్కువగా ఉండటంతో పెనుప్రమాదం తప్పిందని జమ్మూ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ఎంకే సిన్హా తెలిపారు. ఇది ఉగ్రవాదుల దుశ్చర్యా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ ఆరంభించారు. పేలుడుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.