కంచే చేను మేస్తే సామెత చందాన ప్రజల కష్టార్జితానికి భద్రత కల్పించాల్సిన బ్యాంకు అధికారులే ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకుంటే ప్రజలు ఇక ఎక్కడికి పోవాలి?డబ్బులు ఎక్కడ దాచుకోవాలి?తక్కువ సమయంలో కోట్లకు పడగెత్తాలనే ఉద్దేశంతో బ్యాంకులో పని చేస్తున్న ఓ మహిళ అధికారులు ప్రజల ఖాతాలకు కన్నం వేసింది.నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ సమీపంలోని ముసారాంబాగ్‌కు చెందిన సురేఖ ఓ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.బ్యాంకుకు వచ్చే వృద్ధులు, మహిళలతో స్నేహంగా మెలుగుతూ ఎఫ్‌ఢీలు చేస్తే అధిక వడ్డీ వస్తుందంటూ ఆశ చూపి చాలా మందితో ఎఫ్‌డీలు చేయించింది.ఎఫ్‌డీ చేసే సమయంలో దరఖాస్తుల్లో వినియోగదారుల చరవాణి సంఖ్యలకు బదులుగా తన సంఖ్యను పొందుపరిచేది.ఎఫ్‌డీల కాల పరిమితి ఐదు నుంచి పదేళ్ల వరకు ఉండడంతో వినియోగదారులు అప్పటి వరకు ఎఫ్‌డీల గురించి పట్టించుకునేవారు కాదు.దీన్ని ఆసరాగా తీసుకున్న సురేఖ ఎఫ్‌ఢీలు చేసిన నాలుగు నెలలకు ఎఫ్‌డీలు రద్దు చేస్తూ సొమ్మును తన ఖాతాలోకి వేసుకుంది. ఈ క్రమంలో న్యూమారుతీ నగర్ కు చెందిన బాలచందర్, ప్రేమ దంపతులు తమ ఎఫ్‌డీ కాలపరిమితి ముగియడంతో ఇటీవల బ్యాంకుకు వెళ్లారు. అయితే గతంలోనే విత్ డ్రా చేసుకున్నట్లు బ్యాంకు సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. దాంతో చైతన్యపురి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టడంతో సురేఖ చేసిన మోసాలు వెలుగుచూశాయి. 11 మంది ఖాతాదారులకు సంబంధించి రెండున్నర కోట్లు కాజేసినట్లు తేలింది. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.