దిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలో సీట్ల సర్దు బాటు గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడను బుధవారం ఉదయం దిల్లీలో మంతనాలు జరిపారు. దీని గురించి జేడీఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఇప్పటికి రెండు విడతల మంతనాలు జరిగాయి. తాజాగా రాహుల్, దేవెగౌడ భేటీతో సీట్ల పంపకాలు కొలిక్కివచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. పన్నెండు స్థానాల్లో పోటీకి జేడీఎస్ పట్టు బట్టింది. వాటిలో నాలుగు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. దరిమిలా జేడీఎస్ ప్రతిపాదనకు కాంగ్రెస్ విముఖత చూపింది. తదనంతరం చర్యల్లో జెడీఎస్ పది స్థానాలు కేటాయిస్తే చాలని పేర్కొంది. చివరకు ఎనిమిది స్థానాల్ని మాత్రమే కేటాయించేందుకు హస్తవాసులు సుముఖంగా ఉన్నారు. దళపతులు దీనికి సమ్మతిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం చర్చల్లో కర్నాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారల బాధ్యుడు వేణుగోపాల్, జేడీఎస్ ప్రధాన కార్యదర్శి కున్వర్ దానిష్ అలీ కూడా పాల్గొన్నారు.