నెల్లూరు : రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసిన ఓ దొంగ మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమర శంఖారావంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో 20 లక్షల దొంగ ఓట్లను కలుపుకొని మన రాష్ట్రంలో మొత్తం 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండే ఓటర్ల జాబితా చంద్రబాబుకు చెందిన ప్రైవేటు కంపెనీల వద్ద లభ్యమవుతోందన్నారు. ప్రభుత్వం దగ్గర ఉండే ఆధార్ డేటా కూడా ఇదే విధంగా చోరీ అయిందన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే, మనల్ని, మన కార్యకర్తలను దూషిస్తున్నారని అన్నారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఓటును తొలగించాలని ప్రయత్నించారని ఆరోపించారు.