అమరావతి : పబ్లిక్ డొమైన్లో ఉండే వివరాలు ఎవరైనా తీసుకునే అవకాశం ఉందని, ఐటీ గ్రిడ్స్ సంస్థ వద్ద లభ్యమైన ఓటర్ల జాబితా కూడా అలాంటిదేనని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి జీకే. ద్వివేది తెలిపారు. డేటా వివాదంపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రాజకీయ ఆరోపణలతో తమకు సంబంధం లేదని, ఎన్నికల ఉద్యోగులు తప్పు చేస్తే క్రిమినల్ కేసులు, సస్పెన్షన్ లాంటి చర్యలు ఉంటాయని ద్వివేది తెలిపారు. ఓటరు జాబితాలో ఆధార్, బ్యాంకు ఖాతాల లింక్ ఉండదని, కనుక వాటికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఎవరికీ లభ్యం కాదని వివరించారు. రాష్ట్రంలో మొత్తం 45 వేల మంది బూత్ స్థాయి అధికారులు ఉన్నారని, వారిలో ఎవరో ఒకరు పొరపాటు చేయవచ్చని చెప్పారు. ఓట్లను తొలగించాలంటూ వారం కిందటి వరకు రోజుకు లక్ష చొప్పున దరఖాస్తులు వచ్చేవని, ఇప్పుడు గణనీయంగా తగ్గాయని వెల్లడించారు. తప్పుడు దరఖాస్తులు సమర్పించిన వారిపై వందకు పైగా కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.