కోయంబత్తూరు: పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన జరిపిన మెరుపు దాడుల్లో ఎంత మంది మరణించారో లెక్కించలేదని భారత వాయుసేన అధిపతి బీఎస్ ధనోవా తెలిపారు.సోమవారం ఇక్కడ ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ‘భారత వాయుసేన మృతుల్ని లెక్కించ జాలదు. అక్కడ ఎంత మంది ఉన్నారనే సంఖ్యపై మృతుల సంఖ్య ఆధారపడి ఉంటుంది. దాడి చేయడమే మా పని. మృతుల సంఖ్య లెక్కల్ని ప్రభుత్వం చూసుకుంటుంది. బాల్‌కోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది నిజమేనని పునరుద్ఘాటించారు. దాడి గురించి వెల్లువెత్తుతున్న సందేహాలను తోసిపుచ్చారు. ‘అనుకున్న లక్ష్యాన్ని వాయుసేన యుద్ధవిమానాలు విజయవంతంగా ఛేదించా యి. ఒక లక్ష్యాన్ని ఛేదించాలని మేము ప్లాన్ చేసినప్పుడు కచ్చితంగా ఢీకొట్టి తీరతాం. ఒకవేళ మేము అడవిలో బాంబులు వేస్తే పాకిస్తాన్ స్పందించాల్సిన అవసరం లేదు కదా. పాకిస్తాన్, భారత్‌పై ప్రతి దాడులకు ప్రయత్నించడమే తాము లక్ష్యాన్ని ఢీ కొట్టామనేందుకు రుజువని ’పేర్కొన్నారు.పాకిస్తాన్ చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి వచ్చిన భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిసిన మరుక్షణం యుద్ధవిమానం కాక్‌పిట్‌లో అడుగుపెడతారని ధనోవా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘అభినందన్ మళ్లీ విధుల్లో చేరతారా లేదా అన్నది ఆయన మెడికల్ ఫిట్‌నెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయనను ప్రస్తుతం విధులకు దూరంగా ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నాం’అని విపులీకరించారు.