న్యూఢిల్లీ: అమేథి పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం తిప్పి కొట్టారు. అమేథిలోనూ మోదీ యథాలాపంగా అబద్ధాలు చెప్పారని అవహేళన చేసారు. ‘2010లో నేనే స్వయంగా అమేథిలో ఆయుధాల ఫ్యాక్టరికి శంకు స్థాపన చేశాను. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ చిన్న చిన్న ఆయుధాలు తయారవుతున్నాయి. నిన్న మీరు అమేథి వెళ్లి మీకు అలవాటైన రీతిలో యథాలాపంగా అబద్ధాలు చెప్పారు. మీకు కొంచెం కూడా సిగ్గనిపించదా? (క్యా ఆప్‌కో బిల్‌కుల్ షరమ్ నహీ ఆథి)’ అని రాహుల్ ట్విటర్‌లో విరుచుకు పడ్డారు. 2004 నుంచి అమేథి నియోజకవర్గానికి రాహుల్ లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. రాహుల్ తల్లి సోనియా గాంధీ ఈ నియోజక వర్గంలో ఒక సారి పోటీ చేసి గెలిచారు కూడా. లోక్‌సభ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత దశలో గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటైన అమేథిలో మోదీ ఆదివారం భారత్-రష్యా సంయుక్త ఆధ్వర్యంలో ఏకే 203 కలాషినికోవ్ అసాల్ట్ రైఫిల్ తయారీ కర్మాగారానికి పునాది రాయి వేసారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎప్పటి లాగే కాంగ్రెస్ నేతలపై విరుచుకు పడ్డారు.2010లో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఆయుధాల కర్మాగారం ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉందని తప్పుబట్టారు.పరోక్షంగా రాహుల్ గాంధీ పునాది రాయి వేసిన ఆయుధాల కర్మాగారం గురించి ఆరోపించారు. ఆ పరిశ్రమ వల్ల ఈ ఫ్యాక్టరీ ద్వారా 1500 మందికి ఉద్యోగాలు వస్తాయని గొప్పలు చెప్పాకున్నారు. కేవలం 200 మందికి మాత్రమే ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. అమేథిలో ఉద్యోగాలు కల్పించలేని వారు దేశంలో ఉద్యోగాల కల్పన గురించి కొండంత చెప్పుకుంటున్నారని’ వ్యాఖ్యానించారు.