జీవనం యాంత్రికంగా తయారైన ప్రస్తుత తరుణంలో పని భారం కూడా ఎక్కువగానే ఉంటోంది. చాలా ప్రైవేట్ కంపెనీలు పని వేళలను పాటించడమే లేదు. యాజమాన్యాలు లక్ష్యాలు విధిస్తుండడంతో ఉద్యోగులు టైం చూసుకుని ఇంటికి వెళ్లే పరిస్థితులు ఎప్పుడో పోయాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆఫీసుకెళ్లి కూర్చుంటే తిరిగి ఇల్లు చేరేసరికి రాత్రి పది దాటినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇలా ఎక్కువ గంటలు పని చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని పలు అధ్యయనాలు వెల్లడించాయి. తాజా అధ్యయనంలో వారానికి 55 గంటలు, అంతకన్నా ఎక్కువగా పని చేసే మహిళలు కుంగుబాటు, ఆందోళన, నిరాశ, నిస్పృహలకు లోనయ్యే ప్రమాదం ఉందని బ్రిటన్లోని క్వీన్ మేరీ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. 20 వేల మంది పై వారీ అధ్యయాన్ని నిర్వహించారు. వారానికి 35 నుంచి 40 గంటలు పని చేసే మహిళలతో పోల్చితే అంతకంటే ఎక్కువ గంటలు పని చేసే మహిళలు కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం 7.3 శాతం అధికంగా ఉంటుందని గుర్తించారు. వారాంతాల్లో విశ్రాంతి తీసుకోని వారు కూడా ఇలాంటి రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఎక్కువని తేలింది.