ఇస్లామాబాద్: ఒక్కసారి యుద్ధమంటూ మొదలైతే అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదని వ్యాఖ్యానించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చర్చలకు
భారత్‌తో సుమఖంగా ఉన్నట్లు ప్రకటించారు. పాక్ ప్రజలనుద్దేశించి ఆయన బుధవారం మాట్లాడారు. ఒక్కసారి యుద్ధం మొదలైతే
దాని నియంత్రణ తన చేతుల్లో గానీ, భారత ప్రధాని మోదీ చేతుల్లో గానీ ఉండబోదని పేర్కొన్నారు. పుల్వామా దాడితో భారత్ పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలనన్నారు. ‘ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం. చర్చల ద్వారా పరిష్కరించుకుందాం’ అని శాంతి
చర్చలకు పిలుపునిచ్చారు.పుల్వామా ఉగ్ర దాడిపై విచారణ జరుపుతామని ఇప్పటికే భారత్‌కు చెప్పామనీ భారత్‌తో సహకరించేందుకు సిద్ధమని చెప్పామన్నారు. భారత్ చర్యలు చేబట్టే యోచనలో ఉందన్న ఉద్దేశంతోనే దాడులకు ప్రతిదాడులు ఉంటాయని హెచ్చరించినట్లు విపులీకరించారు. ‘మంగళవారం ఉదయం భారత్ మమ్మల్ని కష్టపెట్టినప్పటికీ మా వైమానిక దళాలను తొందర పడొద్ద’ని చెప్పాను. భారత్ చర్యల నష్టాన్ని అంచనా వేసేంతవరకు ముందుకెళ్లొద్దని సూచించాను’అని పేర్కొన్నారు. ‘మీరు మా దేశంలోకి అడుగుపెడితే, మేము కూడా అదేపని చేయగలమని చెప్పేందుకు మాత్రమే మేము ఈ మేరకు స్పందించాం. వాళ్లకు చెందిన రెండు మిగ్ విమానాలను కూల్చివేశాం. ఇక ఇక్కడి నుంచి మేము మరింత తెలివిగా వ్యవహరిస్తాం’ అని ఆయన భారత్‌ను హెచ్చరించారు. ‘మీ దగ్గరున్న ఆయుధాలు, మా దగ్గరున్న ఆయుధాలతో తలెత్తే పరిణామాలను తట్టుకోగలమా అని నేను భారత్‌ను అడిగాను. ఇదింకా ముదిరితే… నా చేతుల్లోగానీ, మోదీ చేతుల్లో గానీ ఏమీ ఉండదు’ అని యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలు వదిలారు.