పుల్వామాలో జవాన్లపై ఉగ్ర దాడి అనంతరం భారత్, పాకిస్తాన్‌పై ప్రతీకారేచ్ఛతో రగులుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చైనా ఉప ప్రధాని ఇయూ హె నాయకత్వంలో ఆ దేశ వాణిజ్య బృందం అమెరికా పర్యటనను పురస్కరించుకుని వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాశ్మీర్‌లో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, భారత్ తీవ్రంగా స్పందించే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఆలోచిస్తోంది, ఆ దిశగా ముందుకు కదులుతోంది కూడా…అని చెప్పారు. జవాన్లను కోల్పోయిన భారత్ బాధ తనకు అర్థమవుతోందని అన్నారు.