లక్నో : ఉగ్రవాదంపై నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రం ప్రభుత్వం తుదిపోరు సాగిస్తోందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. శనివారం ఇక్కడ జరిగిన యువత మనసులోని మాట కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థులతో మాటా మంతి సాగించారు. ‘ఉగ్రవాదం తుది దశకు చేరుకుంది. మోదీ ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలనకు కంకణం కట్టుకుంద’ ని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దరిమిలా విద్యార్థులంతా భారత్ మాతాకీ జై.. జై జవాన్ అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన ఆదిత్యనాథ్ ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఆవేశంగా మాట్లాడారు. దాడి జరిగిన రెండు రోజుల్లోనే సూత్రధారిని బలగాలు మట్టుబెట్టాయన్నారు. వీరమరణం పొందిన నలభై మంది జవాన్లల్లో పన్నెండు మంది ఉత్తరప్రదేశ్ బిడ్డలు. జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఇద్దరి అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.