50 కీలక నియోజకవర్గాలపై పవన్ కళ్యాణ్ దృష్టి

50 కీలక నియోజకవర్గాలపై పవన్ కళ్యాణ్ దృష్టి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు. టీడీపీ, వైసీపీల నుంచి దాదాపు సగానికి పైగా అభ్యర్థులు ఖరారు అయినట్లే. ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇంచార్జులు ఉన్నారు. కొన్ని స్థానాలు మినహా టీడీపీ, వైసీపీలకు ఇబ్బంది లేదు.జనసేన గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. సీనియర్ రాజకీయ నాయకులతో పాటు యువతకు, జనసైనికులకు.. ఇలా అందరికీ అవకాశమివ్వనున్నారు. అధికారం విషయం పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో జనసేన కీలకంగా మారనుందనే ప్రచారం సాగుతోంది. త్రిముఖ పోటీ నేపథ్యంలో టీడీపీ, వైసీపీలకు మేజిక్ ఫిగర్ దక్కదని, అప్పుడు పవన్ కీలకం కావొచ్చునని అంటున్నారు.
50 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి..
పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇతర పార్టీలలోని నేతల కోసం చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నాదెండ్ల మనోహర్, టీడీపీ నుంచి రావెల కిషోర్ బాబు వంటి నేతలు వచ్చారు. బీజేపీ నుంచి ఆకుల సత్యనారాయణ సోమవారం జనసేనలో చేరనున్నారు. వైసీపీ నుంచి వంగవీటి రాధా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 175 నియోజకవర్గాలకు గాను జనసేనాని ముఖ్యంగా 50 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.
వారికీ ఛాన్స్..
పవన్ కళ్యాణ్ కీలకంగా భావిస్తున్న ఆ యాభై నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ కూడా ఉంది. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా లెఫ్ట్ పార్టీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా పార్టీలోకి కీలక నేత ఎవరైనా వస్తే వారికి ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. విజయవాడ వంటి నగరంలో యూత్ పాలోయింగ్ ఎక్కువ. విజయవాడలోను పవన్ కళ్యాణ్‌కు అభిమానులు ఎక్కువ అని, అతనికి గట్టి పట్టు ఉందని, అధికార, ప్రతిపక్ష అభ్యర్థులపై ప్రజలకు నమ్మకం లేదని జనసేన కోఆర్డినేటర్ పోతిన వెంకట మహేష్ చెబుతున్నారు.
గట్టి పోటీ ఇస్తా..
విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ తరఫున బోండా ఉమామహేశ్వర రావు ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లాది విష్ణు పోటీ చేస్తారు. ఇక్కడ లెఫ్ట్ పార్టీకి టిక్కెట్ ఇస్తే వారి క్లీన్ ఇమేజ్‌కు పవన్ కళ్యాణ్ హవా జత కలిస్తే విజయం సాధించవచ్చునని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే ఇతర పార్టీల నుంచి కీలక నేతలు వస్తే మాత్రం జనసేనాని మరో ఆలోచన చేసే అవకాశాలు లేకపోలేదు. విజయవాడ సెంట్రల్‌లో జనసేన మద్దతుతో పోటీ చేసేందుకు సీపీఎం నేత బాబురావు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈయన 2009, 2014లలో పోటీ చేసి 38 వేల ఓట్లు, 16 వేల ఓట్లు దక్కించుకున్నారు. తనకు అవకాశమిస్తే గట్టి పోటీ ఇస్తానని బాబూరావు చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos