కరోనా నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్ వేలాది మందిని కుటుంబాలకు దూరం చేసింది.కొంతమందిని తాత్కాలికంగా దూరం చేస్తే మరికొంత మందిని శాశ్వతంగా దూరం చేసింది.కొన్ని అనివార్య కారణాలతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ వరకు కఠినంగా అమలు చేసిన లాక్‌డౌన్‌ను కొద్దికొద్దిగా సడలిస్తూ వస్తుండడంతో జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోంది.లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా రెండు నెలలుగా నిషేధించిన విమానాల సర్వీసులను పునరుద్ధరించడంతో అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో రద్దీ కనిపిస్తోంది.పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వందలాది మంది విమానాల్లో తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు.ఈ క్రమంలో లాక్‌డౌన్ కారణంగా ఢిల్లీలో చిక్కుకుపోయిన ఓ ఐదేళ్ల బుడ్డోడు విమానంలో ఒంటరిగా ప్రయాణించి బెంగళూరుకు చేరుకున్నాడు. విమానం సర్వీసులు పునరుద్ధరించడంతో తమ బిడ్డను ఢిల్లీ నుంచి బెంగుళూరుకు రప్పించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫలితంగా ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వచ్చిన విమానంలో ఐదేళ్ళ బుడ్డోడు కుటుంబ సభ్యులు లేకుండానే ఒంటరిగా వచ్చాడు. ఈ విమానంలో ప్రయాణించినవారంతా ఆ బాలుడిని ఆశ్చర్యంగా చూడసాగారు.ఇంతకీ ఆ బుడ్డోడి పేరు ఏంటో తెలుసా.. విహాన్ శర్మ. వయసు ఐదేళ్లు. సోమవారం ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వచ్చిన విమానంలో ఈ విహాన్ శర్మ కెంపె గౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ తల్లి రిసీవ్ చేసుకుంది. అయితే, అధికారుల ఆదేశం మేరకు ఆ చిన్నోడికి హోం క్వారంటైన్కు తరలించారు.కాగా, ఈ బాలుడిని స్పెషల్ కేటగిరీ ప్యాసింజర్గా విమాన సిబ్బంది గుర్తించి, సురక్షితంగా బెంగుళూరుకు తీసుకొచ్చారు. ప్రయాణ సమయంలో ఈ బుడ్డోడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజ్లు ధరించి, చేతిలో మొబైల్ ఫోను పట్టుకుని వచ్చాడు.ఢిల్లీలో అతని బంధువులు విమానం ఎక్కించగా, బెంగుళూరులో ఆ బాలుడి తల్లి రిసీవ్ చేసుకుంది. కాగ, ఇంత చిన్న వయసులోనే ఢిల్లీ నుంచి బెంగుళూరుకు ఒంటరిగా ప్రయాణించిన బుడ్డోడిగా విహాన్ శర్మ చరిత్ర సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.