సిరియా రాజధాని డమాస్కస్ చుట్టుపక్కల ఇరానీ లక్ష్యాలపై తాను దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం చెప్తోంది.ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్‌లో ఉన్నతస్థాయి విభాగాలైన కుద్స్ ఫోర్స్‌కు వ్యతిరేకంగా తన ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) పేర్కొంది.అయితే.. ఇజ్రాయెల్ క్షిపణుల్లో అత్యధిక భాగం విమాన విధ్వంసక కాల్పుల్లో ధ్వంసమయ్యాయని సిరియా వార్తా సంస్థలు చెప్పాయి.కుద్స్ బలగాలు ఆదివారం నాడు సిరియా నుంచి గోలన్ హైట్స్ మీదకు ఒక రాకెట్‌ను ప్రయోగించటంతో తాము రంగంలోకి దిగినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.ఆ రాకెట్‌ను మధ్యలోని అడ్డుకుని ధ్వంసం చేశామని చెప్పింది.
ఈ ఆపరేషన్ వివరాలు ఏమిటి?
ఈ ఆపరేషన్ ప్రారంభమైందని ఐడీఎఫ్ సోమవారం ఉదయం వేకువజామున ఒక ట్వీట్ ద్వారా తెలిపింది.ఆయుధాగారాలు, డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒక సైనిక స్థావరం సహా కుద్స్ ఫోర్స్‌కు చెందిన కేంద్రాలు లక్ష్యంగా తాము దాడులు చేసినట్లు చెప్పింది.‘‘విస్పష్టమైన హెచ్చరికలు చేసినా కూడా.. భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులను డజన్ల సంఖ్యలో ప్రయోగించారు. దీనికి ప్రతిస్పందనగా మేం కూడా సిరియా సైనిక దళాలకు చెందిన వైమానిక భద్రతా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాం’’ అని ఐడీఎఫ్ పేర్కొంది.”శత్రు క్షిపణులు” చాలా వాటిని సిరియా వైమానిక భద్రత నిర్వీర్యం చేసిందని సైనిక వర్గాలను ఉటంకిస్తూ సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ సానా పేర్కొంది.రాత్రిపూట ఆకాశంలో భారీ విస్ఫోటనాలు వినిపించాయని డామస్కస్‌లో ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ఇజ్రాయెలీ రాకెట్లు ”రాజధాని డమాస్కస్ పరిసరాలను” లక్ష్యంగా చేసుకుంటున్నాయని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎస్ఓహెచ్ఆర్) చెప్తోంది.ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలు, ఇరాన్ మద్దతిస్తున్న హిజ్బుల్లా ఉద్యమ సైనిక స్థావరాల్లోని ఆయుధ డిపోలను ఇజ్రాయెలీ క్షిపణులు ధ్వంసం చేశాయని ఎస్ఓహెచ్ఆర్ ఆ తర్వాత పేర్కొంది.ఈ దాడుల్లో కొందరు చనిపోయినట్లు కూడా ఎస్ఓహెచ్ఆర్ చెప్పింది
నెతన్యాహు హెచ్చరిక
సిరియా లోపల లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ అంగీకరించటం చాలా అరుదు.”ఉత్తర గోలన్ హైట్స్ మీదకు ఒక రాకెట్‌ను ప్రయోగించారు.. దానిని డోమ్ ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుని ధ్వంసం చేసింది” అని ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత ఈ ఆపరేషన్ మొదలైంది.గోలన్ హైట్స్‌లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం మౌంట్ హెర్మాన్‌ను ఈ దాడుల ఫలింగా మూసివేశారు.ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం చాడ్‌లో పర్యటిస్తూ ఒక హెచ్చరిక జారీచేశారు.”మాకొక విధానం ఉంది.. సిరియాలో ఇజ్రాయెల్ జోక్యాన్ని లక్ష్యంగా చేసుకోవటం.. మాకు హాని చేయటానికి ప్రయత్నించిన వారిని దెబ్బతీయటం” అని ఆయన పేర్కొన్నారు.సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు మద్దతుగా సిరియాలో ఇరాన్ సైన్యాన్ని మోహరించటం పట్ల ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తంచేసింది. 2011లో సిరియాలో అంతర్యుద్ధం ఆరంభమైనప్పటి నుంచీ తిరుగుబాటు బలగాలు, ఇస్లామిక్ గ్రూపులతో బషర్ పోరాడుతున్న విషయం తెలిసిందే.2018 మే నెలలో.. గోలన్ హైట్స్‌లో తన స్థావరాలపై రాకెట్ దాడి జరిగిన నేపథ్యంలో.. సిరియాలోని ఇరాన్ సైనిక సదుపాయాలన్నిటినీ దాదాపుగా ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది.సిరియాకు చెందిన ఈ భూభాగాన్ని 1967లో ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకుని, ఆ తర్వాత కలిపివేసుకుంది.