ఈడెన్ పార్క్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సొంతం చేసుకుంది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా ఇంకా ఏడు బంతులు మిగిలి ఉంగానే లక్ష్యాన్ని చేరుకుంది. టీమ్ విజయంలో రోహిత్, కృనాల్ కీలకపాత్ర పోషించారు. లక్ష్య ఛేదనలో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్(50), శిఖర్(30), విజయ్ శంకర్(14) వికెట్లు కోల్పోయినా.. రిషబ్ పంత్(40 నాటౌట్), ధోనీ(20 నాటౌట్) మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చారు. దీంతో సిరీస్ 1-1తో సమమయ్యింది. కివీస్ బౌలర్లలో ఫెర్గ్యూసన్, సోధి, మిచెల్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. తొలి టీ-20 మ్యాచ్‌లో భారత బౌలింగ్‌ను ఊచకోత కోసిన ప్రమాదకర బ్యాట్స్‌మెన్ సీఫెర్ట్ (12) ఆరంభంలోనే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పదిహేను పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం కృనాల్ పాండ్యా కివీస్‌ను కష్టాల్లోకి నెట్టేశాడు. ఓపెనర్ మున్రో (12), మిచెల్ (1), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (20) కృనాల్ ధాటికి క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఈ దశలో గ్రాండ్‌హోమ్ (50), రాస్ టేలర్ (42) కివీస్‌ను ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్న ఈ జోడీని హార్దిక్ పాండ్యా విడదీశాడు. పాండ్యా బౌలింగ్‌లో రోహత్‌కు క్యాచ్ ఇచ్చి గ్రాండ్‌హోమ్ వెనుదిరిగాడు. కొద్దిసేపటికే టేలర్ రనౌట్ అయ్యాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మన్ పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కృనాల్‌కు 3, ఖలీల్‌కు 2 వికెట్లు దక్కాయి. భువనేశ్వర్‌కుమార్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.