భువనేశ్వర్: పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇటీవల ‘యునైటెడ్ ఇండియా’ ర్యాలీకి అనూహ్య స్పందన రావడం టీఎంసీలో కొత్త ఉత్సాహం నింపింది. జాతీయ స్థాయితో పార్టీ పరిధిని విస్తరించే వ్యూహంతో పావులు కదుపుతోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల నుంచి పోటీ చేయనున్నట్టు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ప్రకటించింది. ఒడిశాలో జరిగిన మీడియా సమావేశంలో టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరిక్ ఒబ్రెయిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాతో సహా 14 రాష్ట్రాల్లో టీఎంసీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. ‘మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. 2019లో బీజేపీ అంతం ఖాయం’ అని అన్నారు. కాగా, ఏయే రాష్ట్రాల్లో టీఎంసీ పోటీ చేయనుందనే విషయాన్ని ఆ పార్టీ ఇంకా వెల్లడించలేదు. అయితే పశ్చిమబెంగాల్‌లోని మొత్తం 42 స్థానాల్లోనూ టీఎంసీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ప్రకటించింది.