సీఎం కేసీఆర్, తాను 13 ఏళ్ల తర్వాత మాట్లాడుకున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తాను తొలిసారి ఎమ్మెల్యే అయింది టీఆర్‌ఎస్ నుంచేనని తెలిపారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై అసెంబ్లీలో తాను అడగ్గానే సానుకూలంగా స్పందించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ఏర్పాటుపై జీవో రాగానే ముఖ్యమంత్రిని కలుస్తానని, పార్టీలకతీతంగా కేసీఆర్‌ను సంగారెడ్డికి ఆహ్వానించి ఘన స్వాగతం పలుకుతానని తెలిపారు. అనంతరం సీఎల్పీలో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు అవలంబించిన విజన్ 2020 వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. మెదక్ నుంచి రాహుల్ పోటీ చేస్తే.. కేసీఆర్ నిలబడ్డా రాహులే బంపర్ మెజార్టీతో గెలుస్తారని అన్నారు.