పోలీసు శాఖలోని ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ స్థాయిలో రెండో దశలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు పోలీస్ నియామకబోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీస్ ఎంపిక ప్రక్రియలో దేశంలోనే తొలి సారిగా తెలంగాణలో పూర్తిస్థాయిలో సాంకేతిక పరికరాల్ని ఉపయోగిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అక్రమాలు, విమర్శలకు తావులేకుండా శరీర దారుఢ్య పరీక్షలు జరిగే గ్రౌండ్ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉంచుతున్నారు. ఇక పురుష, మహిళా అభ్యర్థులకు ఒకే రోజు వేర్వేరు బ్యాచ్‌ల్లో శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించడం వల్ల తలెత్తే ఇబ్బందులను అధిగమించేందుకు ఈ సారి మహిళా అభ్యర్థులకు ప్రత్యేక రోజుల్లో బ్యాచ్‌ల్ని కేటాయిస్తున్నారు. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు రెండో దశ ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ ప్రక్రియ శనివారం అర్ధరాత్రితో ముగుస్తుంది. ఈ నెల 11న ప్రారంభమయ్యే రెండోదశ ఎంపిక ప్రక్రియ మార్చి మూడో వారం నాటికి పూర్తి కానుంది. ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ స్థాయిలో సుమారు 2.60 లక్షల మంది అభ్యర్థులు శరీర దారుఢ్య పరీక్షలకు హాజరవుతారు. ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అధికారులు అన్ని గ్రౌండ్‌ల వద్ద శనివారం డెమో నిర్వహిస్తున్నారు. శరీర దారుఢ్య పరీక్షల నిర్వహణకు ఈ సారి పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. అభ్యర్థి ఎత్తు, ఛాతీని కొలిచేందుకు డిజిటల్ మీటర్లు ఉపయోగిస్తున్నారు. పురుష అభ్యర్థులకు 100, 800 మీటర్ల పరుగు, మహిళా అభ్యర్థులకు 100 మీటర్ల పరుగుకు ఆర్‌ఎ్‌ఫఐడీ ప్యాడ్‌లను ఉపయోగిస్తున్నారు. ఆర్‌ఎ్‌ఫఐడీ ప్యాడ్‌ని అభ్యర్థికి తగిలించడం వల్ల ఎంత సమయంలో గమ్యం చేరారన్నది ఆటోమేటిక్‌గా రికార్డు అవుతుంది. దీనివల్ల అభ్యర్థులకు .6 సెకన్ల సమయం అదనంగా కలిసొస్తుంది. షార్ట్‌ఫుట్, లాంగ్ జంప్ కోసం డిజిటల్ థియోడలైట్స్‌ను ఉపయోగిస్తున్నారు. 2.60 లక్షల మందికి శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని గ్రౌండ్లతో పాటు హైదరాబాద్‌లో 3 గ్రౌండ్లను ఎంపిక చేశారు.
మాయమాటలు నమ్మొద్దు..
పోలీస్ ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగుతోందని ఎవరైనా తప్పుడు మార్గంలో మేలు చేస్తామని చెబితే నమ్మి మోసపోవద్దని బోర్డు అధికారులు చెప్పారు. ప్రతి అంశం టెక్నాలజీతో ముడిపడి ఉంటుందని, ఎక్కడా మానవ ప్రమేయం ఉండదని అన్నారు. ప్రతి బ్యాచ్ ఎంపిక ప్రక్రియ జరిగే సమయంలో ప్రతి అంశం సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని, దాన్ని భద్రపరుస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఏవైనా విమర్శలు వస్తే ఫుటేజీ ఆధారంగా విచారణ చేపడతారని అన్నారు. వేలిముద్రలు తీసుకున్న తర్వాతే అభ్యర్థుల్ని గ్రౌండ్‌లోకి అనుమతిస్తారు. అభ్యర్థులు ఫోన్లు, ఇతర వస్తువులను తీసుకురావద్దని, వాటిని భద్రపరిచేందుకు ఎలాంటి ఏర్పాట్లు ఉండవని అధికారులు తెలిపారు