కాన్పూరు : బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల పొత్తుపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పదునైన విమర్శలు గుప్పించారు. ‘‘సోమవారమైతే ప్రధాన మంత్రి మాయావతి, మంగళవారమైతే ప్రధాన మంత్రి అఖిలేశ్ యాదవ్, రోజుకో ప్రధాన మంత్రి’’ అని పరిహసించారు. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూరులో బుధవారం బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఎన్డీయే ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో తాము స్పష్టంగా చెప్తున్నామన్నారు. నరేంద్ర మోదీ తమ ప్రధాన మంత్రి అభ్యర్థి అని చెప్పారు. ‘‘మీ సంగతి ఏమిటి?’’ అని అడిగారు. సోమవారమైతే ప్రధాన మంత్రి మాయావతి, మంగళవారమైతే ప్రధాన మంత్రి అఖిలేశ్ యాదవ్, రోజుకో ప్రధాన మంత్రి అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో వివరిస్తూ ఆరు రోజులకు ఆరుగురు ప్రధాన మంత్రులు ఉంటారని ఎద్దేవా చేశారు. సోమవారం బెహెన్జీ (బీఎస్‌పీ చీఫ్ మాయావతి), మంగళవారం అఖిలేశ్ యాదవ్ (సమాజ్ వాదీ పార్టీ చీఫ్), బుధవారం మమత దీదీ (పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి), గురువారం శరద్ పవార్ (ఎన్‌సీపీ చీఫ్), శుక్రవారం దేవె గౌడ (జేడీఎస్ చీఫ్), శనివారం (మహమ్మద్) సలీం అని వ్యాఖ్యానించారు. కూటమి పార్టీలకు తమ నేత ఎవరో తెలియదన్నారు. 23 పార్టీలకు 9 మంది ప్రధాన మంత్రి అభ్యర్థులు ఉన్నారన్నారు. ఇలాంటి కూటమి దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దడం సాధ్యం కాదన్నారు. 56 అంగుళాల ఛాతీ ఉన్న నరేంద్ర మోదీలాంటివాళ్ళే దేశాన్ని అభివృద్ధి చేయగలరని తెలిపారు.అమిత్ షా వ్యాఖ్యలతో బీజేపీ కార్యకర్తలు సంతోషంగా చప్పట్లు కొట్టారు.