జిల్లాలోని ఆలూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి సొంత గూటికి చేరుకున్నారు. సోమవారం సాయంత్రం నీరజారెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పిన ఏపీ పీసీసీ చీప్ రఘువీరారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. కాగా.. జిల్లాలోని ఆలూరు నియోజకవర్గానికి చెందిన నీరజారెడ్డి 2011లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన నియోజకవర్గంలో పనులు కావడం లేదని అప్పట్లో నీరజా రాజీనామా చేసి బయటికొచ్చేశారు. అప్పట్లో నీరజా రాజీనామా వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమె మళ్లీ కాంగ్రెస్‌తోనే రీ-ఎంట్రీ ఇచ్చారు. కాగా నీరజారెడ్డి భర్త సురేష్‌రెడ్డి 1994లో పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నీరజా మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తమ అభిమాన నేత మళ్లీ రాజకీయాల్లోకి రావడంతో నీరజారెడ్డి అభిమానులు, అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు.