సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్‌ నాగేశ్వరరావుకు తాఖీదులు

న్యూఢిల్లీ :  సీబీఐ తాత్కాలికమాజీ చీఫ్‌ ఎం నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టు గురువారం
కోర్టు ధిక్కరణ సమన్లు జారీ చేసింది. ఈనెల 12న న్యాయస్ధానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోంలో బాలికలపై లైంగిక దాడి కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి ఏకే శర్మను కోర్టు అనుమతి లేకుండా బదిలి చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సుప్రీం కోర్టు నిర్ధారించింది. తన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సీబీఐ ప్రాసిక్యూషన్‌ ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌ ఎస్‌ వాసూరాంను కూడా కోర్టు ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఏకే శర్మ బదిలీ ప్రక్రియలో భాగస్వాములైన అధికారుల పేర్లను ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది.  ‘ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీరు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆదేశాలతో ఆడుకున్నారు. దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఎప్పుడూ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆడుకోకండి.’ అంటూ సీజేఐ రంజన్‌ గొగొయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న ముజఫర్‌పూర్ షెల్టర్ హోమ్ కేసు విచారణను సుప్రీంకోర్టు ఇవాళ ఢిల్లీసాకేత్‌ పోక్సో కోర్టుకు బదిలీ చేసి, ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.  షెల్టర్‌ హోంలో పలువురు బాలికలపై నిర్వాహకులు లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos