న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న హైడ్రామా ఇవాళ పార్లమెంటుకు చేరింది. ఉభయ సభలు ప్రారంభం కాగానే కేంద్రం వైఖరిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజ్యసభలో టీఎంసీ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ సభాకార్యక్రమాలను అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. సీబీఐ దుర్వినియోగంపై చర్చ చేపట్టాలంటూ టీఎంసీ పట్టుపట్టింది. దీంతో సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్, వెంకయ్య నాయుడు ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల నిరసనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా టీఎంసీ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం రాజకీయ కక్షసారింపు చర్యలు సరికావని కేంద్రానికి వ్యతిరేకంగా టీఎంసీ ఎంపీలు నినాదాలు చేశారు.తృణమూల్‌కు మద్దతుగా విపక్షాలు కూడా ఆందోళన బాటపట్టాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. బెంగాల్లో సీబీఐ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం వార్ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.