న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషి కుమార్ శుక్లా ఇవాళ సీబీఐ నూతన డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అలోక్ వర్మ తొలగింపు తర్వాత తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావు నుంచి శుక్లా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఆయన వస్తుండగానే సీబీఐ విషయంలో పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ, కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం నెలకొనడంతో… ఈ తొలి సవాలు ఎలా ఎదుర్కొంటారన్న దానిపై విశేష ఆసక్తి నెలకొంది. మధ్య ప్రదేశ్ కేడర్‌కి చెందిన 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శుక్లా… 2016 జూన్ 30 మధ్య ప్రదేశ్ 28వ డీజీపీగా నియమితులయ్యారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత వారం ఆయనను తొలగించి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్‌గా బదిలీ చేసింది. కాగా మధ్య ప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టక ముందు శుక్లా ఇంటిలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేశారు. రైల్వే, నార్కోటిక్స్, హోంగార్డ్స్ విభాగాలకు అదనపు డైరెక్టర్ జనరల్‌గానూ ఆయన పనిచేశారు. గ్వాలియర్‌కు చెందిన 59 ఏళ్ల శుక్లా తొలుత రాయ్‌పూర్ ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం దామో, శివపురి, మందసౌర్ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. 1992 నుంచి 1996 వరకు డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోనూ.. 2009 నుంచి 2012 వరకు ఇంటిలిజెన్స్ ఏడీజీగా పనిచేశారు. 1995లో సంక్షోభ నిర్వహణ (క్రైసిస్ మేనేజ్మెంట్)పై, 2005లో హోస్టేస్ నెగోషియేషన్స్పై అమెరికాలో శిక్షణ తీసుకున్నారు. 2017లో మెడికల్ లీవ్ తీసుకున్న ఆయన మళ్లీ గతేడాది అక్టోబర్‌లో బైసాస్ సర్జరీ కోసం 45 రోజులు సెలవు తీసుకున్నారు. కాగా శుక్లా సీబీఐలో పనిచేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.