సినిమా టిక్కెట్‌ పట్టించింది

  • In Crime
  • January 24, 2019
  • 956 Views
సినిమా టిక్కెట్‌ పట్టించింది

నిఘా కెమెరాలు హత్య కేసు నిందితులను పట్టించాయి. మదనపల్లె గ్రామీణ మండలంలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితులను రూరల్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి తెలిపారు. మంగళవారం వివరాలను వెల్లడించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన ఆకుల రవికి ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య ధనలక్ష్మికి పవన్‌కుమార్‌, విజయ్‌కుమార్‌ సంతానం. రెండో భార్య శ్యామలకు ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కుమారుడు ఉన్నాడు. 2014 సంవత్సరంలో విజయకుమార్‌ గోరంట్ల సమీపంలో ఆటోను లారీ ఢీకొట్టడంతో మృతి చెందాడు. విజయ్‌కుమార్‌కు బీమా డబ్బులు రూ.5.70లక్షలు రానున్నాయి. ఈ డబ్బు తండ్రి, తల్లి జాయింట్‌ అకౌంట్‌లో వేస్తారని తెలుసుకున్న పవన్‌కుమార్‌..ఆ డబ్బు మొత్తం తన తల్లి ధనలక్ష్మికే చెందాలని తరచూ తండ్రి, సవతి తల్లి కుమారుడితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో మాటామాట పెరిగి పవన్‌కుమార్‌ తండ్రిని, సోదరుడ్ని చంపుతానని బెదిరించాడు. దీంతో పవన్‌కుమార్‌ తమను ఎలాగైనా చంపేస్తాడని భావించి.. పథకం ప్రకారం చంపేయాలని తండ్రి రవి, సవతితల్లి కుమారుడు నిర్ణయించుకున్నారు. పవన్‌కుమార్‌ తన భార్య మాధవితో కలసి ఏడాది క్రితం మదనపల్లెకు వచ్చి నీరుగట్టువారిపల్లెలో మగ్గాలు నేస్తున్నాడు. ఈనెల 20వ తేదీన తిరుపతి నుంచి మదనపల్లెకు వచ్చిన పవన్‌కుమార్‌ సవతి తల్లి కుమారుడు తన అన్నతో కలసి సినిమాకు వెళ్లాడు. సినిమాలో ఉన్న సమయంలో తనకు చిన్న పని ఉందని బయటకు వచ్చేసి కొడవలి కొనుగోలు చేసుకుని.. హత్య చేసేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రాంతంలో కొడవలి దాచి ఉంచాడు. రాత్రి తన అన్న పవన్‌కుమార్‌ను కొడవలి దాచి ఉంచిన ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించాడు. మద్యం మత్తులో పవన్‌కుమార్‌ మతిలేకుండా పడి ఉండగా.. కొడవలితో నరికి చంపినట్లు డీఎస్పీ తెలిపారు. మృతుడి జేబులో ఉన్న సినిమా టికెట్క ఆధారంగా ఆ థియేటర్‌కు వెళ్లి పోలీసులు నిఘా కెమెరాలను పరిశీలించారు. అందులో పవన్‌కుమార్‌,  అతని సవతి తల్లి కుమారుడు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నీరుగట్టువారిపల్లెలో ఉన్న మద్యం దుకాణాల వద్ద ఉన్న నిఘా కెమె రాలను పరిశీలించారు. అక్కడ కూడా వీరిద్దరు ఉన్నట్లు గురించి మృతుడి సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తానే తన సోదరుడికి మద్యం తాగించి పథకం ప్రకారం కొడవలితో నరికేశానని నిందితుడు ఒప్పుకున్నాడు.దీంతో నిందితుడైన మృతుడి సవతి తల్లి కుమారుడు (19), హత్యకు పథకం రచించిన తండ్రి రవిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నేరస్తులను పట్టుకోవడంలో సీఐ రమేష్‌, ఎస్సైలు దిలీప్‌కుమార్‌, శంకర్‌నాయక్‌తో పాటు సిబ్బంది ఎంతగానో కృషి చేశారని ఆయన అభినందించారు. నిందితుడు హత్య చేసి ఏమీ తెలియనట్లు ఆసుపత్రికి వచ్చాడని,  సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి నిందితుడ్ని గుర్తించామన్నారు. అన్ని ప్రాంతాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు, పోలీసులకు ఉపయోగంగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos