కృష్ణా: కేసరిపల్లిలో లబ్దిదారులకు సీఎం చంద్రబాబు చెక్కులు పంపిణీ చేశారు. పేదలందరికీ ఇంటి పెద్దగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారు. నాలుగేళ్లలోనే ఫించన్లను రూ.2వేలకు పెంచామన్నారు. గన్నవరం మండలం కేసరపల్లిలో చంద్రబాబు పర్యటించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..పెరిగిన ఫించన్‌తో వృద్ధులకు భద్రత పెరిగిందన్నారు. డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రిక అని చెప్పారు. మహిళలకు గుర్తింపు, ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని డ్వాక్రా సంఘాలు పెట్టామని చెప్పారు. మహిళలకు మూడు విడతలుగా రూ.10 వేలు ఆర్థికసాయం చేస్తున్నామని తెలిపారు. పసుపు కుంకుమ కింద రూ.10వేల చొప్పున రెండు దఫాలు ఇచ్చామన్నారు. ఆడబిడ్డలకు ఓ అన్నగా పసుపు కుంకుమ కానుక ఇస్తున్నామని సీఎం అన్నారు. తాము ఉచితంగా ఇస్తున్న సొమ్మును..రుణం అంటూ కొందరు దుష్ప్పచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘అభివృద్ధి జరుగుతున్నందునే భూముల ధరలు పెరిగాయి. ఆధార్ తరహాలో భూధార్ తీసుకొచ్చాం. రూ.83వేల కోట్లతో 23 లక్షల ఇళ్లను నిర్మించి ఇస్తున్నాం. 4 లక్షల ఇళ్లకు ఒకే గృహప్రవేశం చేయనున్నాం. కాపులకు రిజర్వేషన్లు కల్పించి ఎవరూ చేయని సాహసం చేశాం’’మని సీఎం వ్యాఖ్యానించారు.