న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి వయసు మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. తీర్పును ఉపసంహరించుకోవాలంటూ నాయర్ సర్వీస్ సొసైటీ తరపు న్యాయవాది కె. ప్రసరణ్ వాదనలు ఆరంబించారు..ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యు ల ధర్మాసనం విచారణ జరుపుతోంది. జస్టిస్ గొగోయ్‌తో పాటు న్యాయమూర్తులు ఆర్ఎఫ్ నారీమన్, ఏఎం ఖన్వీల్కర్, డీవై చంద్రచూడ్ ధర్మాసనం సభ్యులు. స్వామి అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ… నిరుడు సెప్టెంబర్ 28న నాటి సీజే దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మహిళలపై నిషేధం విధించడం లింగ వివక్షను ప్రోత్సహించడమేనన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆలయ సంప్రదాయాన్ని పక్కన బెడుతూ సుప్రీం ఇచ్చిన ఈ తీర్పుపై కేరళలో తీవ్ర వివాదం రేగింది. దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 64 పిటిషన్లు దాఖలయ్యాయి.