వైసీపీ నేత ఇంటి ముందు తల్లీకొడుకుల నిరసన

వైసీపీ నేత ఇంటి ముందు తల్లీకొడుకుల నిరసన

‘మాకు చెందిన 325 గజాల స్థలాన్ని స్థానిక వైసీపీ నేత గౌతంరెడ్డి ఆక్రమించారు.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కోట్లవిలువ చేసే స్థలం కబ్జాచేయాలని చూస్తున్నారు.. మూడేళ్లుగా పోరాడుతున్నా న్యాయం జరగడం లేదు.. మా స్థలాన్ని మాకు ఇప్పించి న్యాయం చేయండి’ అంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వృద్ధురాలైన తల్లితో కలిసి గౌతంరెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. విజయవాడకు చెందిన గండూరి విజయలక్ష్మి, ఆమె కుమారుడు గండూరి ఉమామహేశ్వరరావు సోమవారం ఉదయం వైసీపీ నేత గౌతంరెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. తమస్థలాన్ని గౌతంరెడ్డి కబ్జా చేశారంటూ వారు ఆరోపించారు. భగత్‌సింగ్‌ రోడ్డులోని కోట్లవిలువ చేసే 325 గజాల స్థలం తన తల్లిదని ఉమామహేశ్వరరావు తెలిపారు. గౌతంరెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న తమ స్థలంలో నిర్మించిన షెడ్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన అనుచరులు తలుపులు వేసేశారని తల్లీకొడుకులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా గండూరి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. తమ తల్లికి చెందిన 325 గజాల స్థలాన్ని తప్పుడు డాక్యుమెంట్లతో వైసీపీ నేత గౌతమ్‌రెడ్డి ఆక్రమించారని, దీనిపై వైసీపీ అధినేత జగన్‌తోపాటు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, మల్లాది విష్ణు తదితర నేతల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని కానీ ప్రయోజనం లేకపోయిందన్నారు. తాము ఏ పార్టీకి చెందిన వాళ్లం కాదని, తమకు న్యాయం చేయాలని తల్లీకొడుకులు వేడుకున్నారు. స్థలానికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, పోలీసుల వద్దకు వెళ్లినా తమకు న్యాయం జరగడం లేదని వారు వాపోయారు. అందుకే న్యాయం జరిగే వరకు స్థలం వద్దే నిరసన తెలపాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గౌతంరెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న వివాదాస్పద స్థలం వద్ద సోమవారం ఉదయం నుంచి గండూరి విజయలక్ష్మి, ఆమె ఇద్దరు కుమారులు నిరసన తెలుపుతున్నారు. వర్షంలోనూ నిరసన కొనసాగించారు. బాధితులకు టీడీపీ నేతలు, కార్పొరేటర్‌ మహేష్‌ మద్దతు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos