భారత్-పాక్ ల మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు ప్రపంచ వ్యాప్తంగా విమానారవాణా సేవల్ని ప్రభావితం చేసింది. ఇండియా-పాకిస్తాన్ మార్గంలో రోజుకు సగటున 800 అంతర్జాతీయ విమానాలు ప్రయాణిస్తాయి. ఐరోపా నుంచి దక్షిణాసియా, ఆస్ట్రేలియా వెళ్లే విమానాలు పాక్, ఉత్తర భారతం మీదుగా వెళతాయి. వీటిలో ఎక్కువగా సింగపూర్, బ్యాంకాక్‌కు విమానాలుంటాయి. ప్రస్తుతం ఐరోపా విమానాలు ఇరాన్ ద్వారా దక్షిణ భారతం మీదుగా గమ్యస్థానాలకు వెళ్లాల్సి వస్తోందని పౌర విమానయాన సంస్థ ప్రతినిధి ఒకరు విపులీకరించారు. పాక్ మీదుగా ప్రయాణించాల్సిన తమ విమానాలు కొన్ని రద్దు కాగా మరి కొన్నింటిని దారి మళ్లించారు. థాయి ఎయిర్వేస్ ఐరోపా విమాన సర్వీసులన్నిటినీ రద్దు చేసింది. పాక్ గగన తలంలో విమాన సంచారానికి వీల్లేక పోవటంతో భారత గగనతలంలో విపరీతమైన రద్దీ ఏర్పడటంలో థాయి విమాన సంస్థ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాలు కూడా ప్రత్యామ్నాయ బాట పట్టాయి. దరిమిలా గమ్యస్థానం దూరం అధికమై మార్గమధ్యంలో ఇంధనాన్ని నింపుకోవాల్సి వచ్చిందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. కొన్ని అంతర్జాతీయ విమానాలు ముంబయి మీదుగా వెళ్లాయి. భారత్‌లో బుధవారం కాసేపు విమానాశ్రయాలను పౌర విమానయానానికి దూరం చేయటంతో ఇండిగో, గో ఎయిర్, జెట్ ఎయిర్వేస్, విస్తారా తమ సేవల్ని నిలిపి వేశాయి. అనంతరం పౌర విమానయానానికి పచ్చ జెండా ఊపినా విమాన సంస్థలు విమానాల్ని రంగంలోకి దించలేదు.