వారు జైలుకెళ్తారనే ప్రియాంక రాజకీయాల్లోకి : సాధ్వి ప్రాచి

వారు జైలుకెళ్తారనే ప్రియాంక రాజకీయాల్లోకి : సాధ్వి ప్రాచి

షాజహాన్‌పూర్: ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వి ప్రాచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎప్పుడైనా జైలుకు వెళ్లే అవకాశాలున్నాయనీ.. అందుకే ఆమెను కాంగ్రెస్‌లోకి తీసుకువస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఎన్ఎస్‌యూఐ నాయకుడు ఇర్ఫాన్ హుస్సేన్ చేతిలో వేధింపులకు గురైన ఓ విద్యార్ధినిని పరామర్శించేందుకు సాధ్వీ నిన్న షాజహాన్‌పూర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దేశంలోని ఆడపిల్లల భవిష్యత్తును నాశనం చేసేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎన్ఎస్‌యూఐ నాయకుడికి వ్యతిరేకంగా గళం వినిపించడంలో బాధితురాలు అత్యంత సాహసం ప్రదర్శించింది. బాలికలు చదువుకోవాలంటూ మన ప్రభుత్వం ప్రోత్సహిస్తుంటే…   అలా జరగకూడదని కాంగ్రెస్ కోరుకుంటోంది. నిందితులపై పోరాడడంతో బాధితురాలు ఒంటరి కాదనీ.. ఆమె వెనుక తాము ఉన్నామని చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చాను…’’ అని ఆమె పేర్కొన్నారు. ఇటీవల రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన ప్రియాంక గాంధీపై ఆమె స్పందిస్తూ… ‘‘కాంగ్రెస్ ఆమెకు పార్టీలో బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి కాదు. కానీ రాహుల్ గాంధీ, సోనియా ఎప్పుడైనా జైలుకు వెళ్లే అవకాశం ఉండడంతో ఈ సారి కాంగ్రెస్‌కు వేరే మార్గం లేదు. ప్రియాంక గాంధీ వచ్చినంత మాత్రం 2019 ఎన్నికల్లో పెద్ద మార్పేమీ ఉండదు. మళ్లీ బీజేపీ విజయం ఖాయం…’’ అని పేర్కొన్నారు. ప్రియాంక వాద్రా కాస్తా ఎన్నికల సమయం వచ్చే సరికే ప్రియాంక గాంధీగా మారిపోయిందనీ… ఇప్పుడు ఆమెతో సహా ప్రతిపక్షాల మహాకూటమికి 19 మంది ప్రధాని అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos