లక్నో: బడ్జెట్ సమావేశాల తొలిరోజైన మంగళవారంనాడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ విపక్షాలు అనుసరించిన తీరుపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలను గూండాలతో పోల్చారు. యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్పీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గలభా స్పష్టించడంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనూ ఉద్దేశించి గవర్నర్ రామ్ నాయక్ ప్రసంగిస్తుండగా, విపక్ష నేతలు పేపర్ ఉండలను ఆయనపై విసిరారు. దీనిపై సభానంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఎస్పీ, బీఎస్‌పీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రవర్తన అప్రజాస్వామికమని, రాజ్యాంగవిరుద్ధమని అన్నారు. ఇలాంటి ప్రవర్తన వల్ల ప్రజాస్వామ్య బలహీనపడటంతో పాటు వ్యవస్థల ప్రతిష్ట దిగజారుతుందని అన్నారు. ‘సమాజ్ వాదీ పార్టీ సభ్యులు సభలో గూండాగిరి చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా ఆయనపై పేపర్ బాల్స్ విసిరారు. వారిది గూండాల పార్టీ. ఇప్పటికీ వాళ్లు తమ గూండాగిరి విడిచిపెట్టడం లేదు’ అని ఆదిత్యనాథ్ మండిపడ్డారు. కాగా, ఈనెల 7న యోగి సర్కార్ 2019-20 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ సమర్పించనుంది. ఈనెల 12 నుంచి నాలుగు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది.