వడ్డీరేట్లు తగ్గాయ్‌

  • In Money
  • February 7, 2019
  • 999 Views

ముంబయి: విశ్లేషకుల అంచనాలే నిజమయ్యాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో కీలక వడ్డీరేట్లలో పావుశాతం కోత విధించింది భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ నేడు ప్రకటించింది.మానిటరీ పాలసీ కమిటీలో వడ్డీరేట్ల తగ్గింపుపై నలుగురు సభ్యులు సానుకూలంగా స్పందించగా.. ఇద్దరు వ్యతిరేకించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచి వృద్ధిరేటును మెరుగుపరచాలన్న ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా ఆర్‌బీఐ నిర్ణయం ఉంది.భారత రిజర్వు బ్యాంకు దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ ఇప్పుడు రెపో రేటును తగ్గించింది. గురువారం దీనిని 25 బేసిస్ పాయింట్లు (అంటే 0.25 శాతం) తగ్గిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకొంది.ఆర్‌బీఐ నిర్ణయంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ తెలిపింది.. ఈ తగ్గింపునకు అనుగుణంగా బ్యాంకులు నిర్ణయం తీసుకోవచ్చని, గృహ, వాహన రుణాలు తీసుకున్నవారికి ఈఎంఐల భారం తగ్గే అవకాశముందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్ప కాలిక నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటును ‘రెపో రేటు’ అని వ్యవహరిస్తారు. బ్యాంకుల వద్ద డబ్బు తీసుకున్నప్పుడు దానిపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటును ‘రివర్స్ రెపో రేటు’ అంటారు. ఆర్‌బీఐ నిర్ణయం ప్రకారం రివర్స్ రెపో రేటు ఆరు శాతానికి చేరింది.ఉర్జిత్ పటేల్ స్థానంలో డిసెంబరులో ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెపో రేటును తగ్గించడం ఇదే తొలిసారి. ఇంతకుముందు చివరిసారిగా 2017 ఆగస్టులో ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించింది.

ఆర్‌బీఐ సమీక్ష కీలక నిర్ణయాలివే..

* రెపో రేటును 6.5శాతం నుంచి 6.25శాతానికి తగ్గింపు
* రివర్స్‌ రెపో రేటును 6శాతానికి, బ్యాంకు రేటును 6.5శాతానికి తగ్గింపు
* మార్చి త్రైమాసికంలో ద్రవ్యల్బోణం 2.8శాతంగా ఉండొచ్చని అంచనా
* 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 3.2-3.4శాతంగా, ఆ తర్వాత మూడు నెలలు 3.9శాతంగా ఉంటుందని అంచనా
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.4శాతంగా అంచనా

రైతులకు ఆర్‌బీఐ కానుక 

తాజాగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా రైతులకు మరో కానుక అందిస్తోంది. హామీ అవసరం లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 1.60లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.ఆరో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. . ‘ద్రవ్యోల్బణం, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6లక్షల వరకు పెంచుతున్నాం. చిన్న, సన్నకారు రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని పేర్కొంది. దీనిపై త్వరలోనే అన్ని బ్యాంకులకు నోటీసు జారీ చేయనుంది. హామీ రహిత వ్యవసాయ రుణాల పరిమితిని ఆర్‌బీఐ 2010లో రూ. లక్ష వరకు పెం
చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos