వచ్చే ఐదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి: గవర్నర్‌

వచ్చే ఐదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి: గవర్నర్‌

ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారం అయిందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. రెండోసారి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా ఉభయసభలను ఉద్దేశించి ఆయన‌ ప్రసంగించారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు నరసింహన్‌ అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వం ముందుకుసాగుతోందని.. విద్యుత్‌ కోతలను అధిగమించి ప్రభుత్వం తొలి విజయం సాధించిందని చెప్పారు. పారిశ్రామిక, ఐటీ రంగంలో పారదర్శక విధానాలు అమలవుతున్నాయని గవర్నర్‌ అన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వివరించారు.

మార్చి నాటికి మిషన్‌ భగీరథ పూర్తి

జీఎస్టీ వసూళ్లలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్‌  నరసింహన్‌ అన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి మిషన్‌ భగీరథ పూర్తవుతుందని చెప్పారు. ఇటీవలే సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించడం సంతోషదాయకమన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా సాగునీటితో పాటు  భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. ‘‘ఒకప్పుడు విద్యుత్‌కోసం రాష్ట్రంలో ఉద్ధృతంగా ధర్నాలు జరిగేవి. 42 నెలల్లోనే 800 మెగావాట్ల సామర్థ్యంతో కేటీపీఎస్‌ ప్రాజెక్టు పూర్తి చేశాం. సౌరవిద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ నేడు దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. విద్యుత్‌ వినియోగంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం.. అభివృద్ధికి సూచికగా నిలుస్తుంది’’.

దేశానికే ఆదర్శంగా ‘రైతుంబంధు’

‘‘రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టడం సంతోషదాయకం. ఈ పథకాన్ని దేశంలోని ఆర్థిక వేత్తలు, వ్యవసాయ వేత్తలు ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాలు రైతుబంధుని అమలు చేసే దిశగా సాగుతున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా రైతులకు కొత్త పాసు పుస్తకాలు అందించాం. రైతు సమస్యలపై చర్చల కోసం రైతు వేదికలను  ఏర్పాటు చేస్తున్నాం. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వ అవసరాల కోసం చేనేత కార్మికుల నుంచి భారీగా వస్త్రాలు కొనుగోలు చేస్తున్నాం. గద్వాలలో టెక్స్‌టైల్‌ హబ్ నిర్మించే యోచనలో ఉన్నాం.’’

సంక్షేమ పథకాల వల్లే రెండోసారి తెరాసను ఆదరించారు

తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనుల కలలను సాకారం చేశాం. కంటి వెలుగు ద్వారా ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నాం. పరిపాలన, శాంతిభద్రతల విషయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా జోన్ల సంఖ్య, రిజర్వేషన్లను పెంచాం. ప్రభుత్వ పారదర్శకత వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.  ఇప్పటికే కొత్తగా 4వేల పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌కు తరలి వచ్చాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్లే ప్రజలు రెండోసారి తెరాసను ఆదరించారు. అన్నిరకాల పింఛన్లను త్వరలోనే రెండింతలు చేస్తున్నాం. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఐకేపీ మహిళలకు అప్పగిస్తాం. బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం పునరంకితం అవుతుంద’’ని గవర్నర్‌ చెప్పారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos