వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న వంగవీటి రాధాకు ప్రముఖ క్రైస్తవ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ బంపరాఫర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్ మాట్లాడుతూ.. రాధాకృష్ణను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీకి అమ్ముడుపోయి తప్పు చేయవద్దన్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని, ప్రభుత్వం ఏర్పాటు చేశాక మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో తాను విఫలమైతే వంద కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. ఈ మొత్తం డబ్బును వంగవీటి రంగా పేరుపై నడుస్తున్న ట్రస్టుకు విరాళంగా ఇస్తానన్నారు. తన తండ్రిని టీడీపీయే చంపించిందని ఆరోపణలున్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరితే రాధాకృష్ణను కాపులు ఎన్నటికీ క్షమించబోరన్నారు. అంతకుముందు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ యాదవ్‌ను కలిసిన కేఏ పాల్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ల నుంచి తనకు ప్రాణ హాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. అలాగే, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై ఫిర్యాదు చేశారు.