ముంబై: భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ కమ్ముకున్న మేఘాలతో గత కొన్ని రోజులుగా చతికిల బడిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ఆరంభమయ్యాయి. పాకిస్థాన్ చెరలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉండటం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఉదయం 10 గంటలకు సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో 36,068 వద్ద నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 10,851 వద్ద ట్రేడయింది. కొనుగోళ్ల మద్దతుతో కీలక రంగాల షేర్లు లాభపడుతున్నాయి. యస్ బ్యాంక్, అశోక్ లేలాండ్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండియాబుల్స్ హెచ్‌ఎస్‌జీ, వేదాంత, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. భారతీ ఎయిర్‌టెల్, సిప్లా, డా రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.