రైతులకు ముష్టి…ధనవంతులకు లక్షల కోట్లు..రాహుల్‌ ఎద్దేవా

రైతులకు ముష్టి…ధనవంతులకు లక్షల కోట్లు..రాహుల్‌ ఎద్దేవా

భవానిపట్న: ప్రధాని నరేంద్రమోదీ, నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. బుధవారం ఒడిశాలోని భవానిపట్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన ర్యాలీకి ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. ‘ప్రధాని మోదీ, నవీన్‌ పట్నాయక్‌ తమ సంపన్న స్నేహితుల కోసమే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం చారిత్రక నిర్ణయం తీసుకున్నామని బడ్జెట్‌ ప్రసంగంలో భాజపా చెప్పుకొంది. కానీ వాళ్లు రైతు కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి ఇస్తుంది రూ.3.5 మాత్రమే. రైతు కుటుంబానికి రోజుకు రూ.17 ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ 15 మంది పారిశ్రామిక వేత్తలకు మాత్రం రూ.3.5లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు. గత ఐదేళ్లుగా మోదీ రైతులను కాపాడుతున్నానని, తమ పార్టీ ముఖ్యమంత్రులు కూడా ఇదే చేస్తున్నారని చెప్పుకొంటున్నారు. కానీ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు మాత్రం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రైతులకు మేలు చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు’ అని రాహుల్‌ అన్నారు. ‘ఛత్తీస్‌గఢ్‌ వెళ్లండి. వరి పంట అమ్మితే ఎంత వస్తుందని అక్కడి రైతులను అడగండి. రూ.2500 ఇస్తున్నాం. నవీన్‌ పట్నాయక్‌ మీకు ఎంత ఇస్తున్నారు?. ఒడిశాలో మా ప్రభుత్వం వస్తే కేవలం రెండు గంటల్లోనే మీకు రూ.2600 ఇస్తాం. ఇది మీ ప్రాంతం, మీ భూమి, మీ నీరు, మీ అడవి. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే గిరిజనుల భూములను కాపాడేందుకు కృషి చేస్తాం’ అని రాహుల్‌ పేర్కొన్నారు. పేదల దగ్గర నుంచి భూములు లాక్కొని వాటిని వాళ్ల పారిశ్రామికవేత్తలైన స్నేహితులకు మోదీ, సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఇస్తున్నారని రాహుల్‌ ఆరోపించారు. చౌకీదార్‌ మోదీ రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా సీఎం పట్నాయక్‌ను నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos