జయపుర: రాజస్థాన్ భాజపా ఉపాధ్యక్షుడు జ్ఞ్యాన్ దేవ్ అహుజా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చారు. జౌరంగజేబు మాదిరిగా కాంగ్రెస్‌కు చివరి చక్రవర్తి రాహుల్ అని, ఇక కాంగ్రెస్ శకం ముగియనుందని అన్నారు. గురువారం అహుజా విలేకరులతో మాట్లాడుతూ రాహుల్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు.అయితే అహుజా చెప్పినట్లు మొఘల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి ఔరంగజేబు కాదు. ఆ సామ్రాజ్యాన్ని చివరగా పాలించింది బహదూర్ షా జాఫర్. ఔరంగ జేబు 1707లో మరణించగా, బహదూర్ షా జాఫర్ 1862లో చనిపోయారు. అయితే మొఘల్ సామ్రాజ్య ప్రముఖ చక్రవర్తుల్లో చివరి రాజు ఔరంగజేబు అని చెప్తుంటారు. భాజపా నేత అహుజా గోవుల స్మగ్లర్లను ఉగ్రవాదులుగా పేర్కొంటూ గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.రాజస్థాన్‌లోని రామ్‌గఢ్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో అహుజా రామ్‌గఢ్ నుంచి గెలుపొందారు. ఈ సారి భాజపా ఈయనకు టికెట్ ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. జనవరి 28న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 199 స్థానాల్లో కాంగ్రెస్ 99 చోట్ల విజయం సాధించింది.