కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమని ప్రకటించారు. గతంలో తను ప్రాతినిధ్యం వహించిన కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసేందుకు రఘువీర రెడీ అవుతున్నారు. గత ఎన్నికల్లో ఈయన పెనుకొండ నుంచి పోటీచేసి మూడో స్థానంలో నిలిచారు. పెనుకొండ నుంచి పోటీచేస్తే తెలుగుదేశం నేత పరిటాల సునీత సహకారం అందిస్తారని అందుకే రఘువీర అప్పుడు అక్కడ పోటీ చేశారని అంటారు.అయితే సునీత రఘువీరకు సహకరిస్తే.. పెనుకొండ నుంచి టీడీపీ తరఫు నుంచి బరిలోకి దిగిన పార్థసారధి రాప్తాడులో తన కులపోళ్లను సునీతకు వ్యతిరేకంగా పని చేయడానికి ఆదేశించారనే ప్రచారం జరిగింది. తన సీట్లో పార్థసారధి కులస్తుల బలం గట్టిగా ఉండటంతో సునీత వెనక్కు తగ్గిందని అంటారు.పెనుకొండ నుంచి పోటీచేసి.. భారీగా ఓట్లు చీల్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయాన్ని ఖరారు చేశారు రఘువీర. ఇక ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గిన కల్యాణదుర్గానికి వెళ్తున్నారు ఈసారి. కల్యాణదుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉషశ్రీ చరణ్ పోటీ చేసే అవకాశాలున్నాయి.తెలుగుదేశం పార్టీ తరఫున సిట్టింగ్ హనుమంత రాయచౌదరి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అక్కడ అభ్యర్థి మార్పు విషయంలో చంద్రబాబు నాయుడు ఆలోచనలో ఉన్నారట.