మోదీ సభలో తోపులాట.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్‌లో ఇవాళ బీజేపీ నిర్వహించిన భారీ ర్యాలీలో పెద్దఎత్తున తోపులాట చోటుచేసుకుంది. కారణంగా మహిళలు, చిన్నపిల్లలు సహా అనేక మందికి గాయాలయ్యాయి. దీంతో ప్రధాని నరేంద్రమోదీ పట్టుమని పావుగంటలోనే తన ప్రసంగాన్ని కుదించుకోవాల్సి వచ్చింది. మతువా వర్గీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ర్యాలీ ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తుండగా… వేదిక వెలుపల ఉన్న వందలాది మంది కార్యకర్తలు సభలో స్త్రీలకు కేటాయించిన ఇన్నర్ రింగ్‌లోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా తోపులాట మొదలయ్యింది. అందరూ తమతమ స్థానాల్లో కూర్చోవాలనీ… వేదిక ముందుకు రావద్దంటూ మోదీ వారించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం దక్కలేదు. బయటి నుంచి వచ్చిన వారికి చోటిచ్చేందుకు కొందరు ఇన్నర్‌రింగ్‌లోని కుర్చీలు తీసి వేదిక ముందున్న ‘నోమ్యాన్’ జోన్‌లోకి విసిరేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో… వెంటనే మోదీ తన ప్రసంగాన్ని ముగించి వేరేచోట ర్యాలీ ఉందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తోపులాట కారణంగా గాయపడిన మహిళలు, పిల్లలకు స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించినట్టు అధికారులు తెలిపారు. గతేడాది జూలై 16న వెస్ట్ మిడ్నాపూర్‌జిల్లాలో మోదీ పాల్గొన్న ఓ ర్యాలీలో సభావేదిక కుప్పకూలడంతో పలువురికి గాయాలైన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం