న్యూఢిల్లీ: కోల్‌కతా సీపీ విషయంలో సీబీఐ వ్యవహరించిన తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఇంట్లో కూడా పోలీసులతో సోదాలు చేయించారనీ… పోలీసులు తన బెడ్రూం, వంటగదుల్లోకి కూడా ప్రవేశించారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ భారత సమాఖ్య నిర్మాణాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలను ప్రత్యర్థి పార్టీలపై ఉసిగొల్పుతూ, ప్రభుత్వ యంత్రాంగాలను దుర్వినియోగం చేస్తున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ మధ్య తీవ్ర వివాదం నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఇవాళ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎలాంటి వారెంటూ లేకుండా ఒక పోలీస్ కమిషనర్ నివాసంలోకి సీబీఐ ఎలా ప్రవేశిస్తుంది. ఇలాంటి వైఖరి అత్యంత ప్రమాదకరం, అప్రజాస్వామికం…’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. శారదా చిట్‌ఫండ్ కేసులో కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లడంతో… రాష్ట్ర పోలీసులు, సీబీఐ అధికారుల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాజీవ్ కుమార్ ఈ కేసులో ఆధారాలు మాయం చేశారంటూ సీబీఐ ఆరోపిస్తోంది. మరోవైపు రాజకీయ కక్ష సాధింపు కోసమే కేంద్రం సీబీఐని ఉసిగొల్పుతోందని ఆరోపిస్తూ సీఎం మమతా బెనర్జీ ధర్నా చేపట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘రాజ్యాంగ పరిరక్షణ’ పేరుతో ఆమె చేపట్టిన ఈ ధర్నాకి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు లభించింది.