మోదీ వల్లే కియా వచ్చిందని బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంగళవారం టీడీపీ ముఖ్యనేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగానన్నారు. బీజేపీ, వైసిపి కుమ్మక్కై రాష్ట్రానికి అప్రతిష్ఠ తెస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా కుతంత్రాలు పన్నుతున్నారన్నారు. అవినీతిరహిత రాష్ట్రాలలో మూడవ స్థానంలో ఏపీ ఉందని సీఎం చెప్పుకొచ్చారు. కరవుసీమలో కియా కార్లు పరుగెత్తడం, సీమలో కృష్ణా జలాల పరవళ్లు తొక్కడం ఇలా ఒకే రోజు రెండు శుభకార్యాలలో పాల్గొనడం తన అదృష్టమని సీఎం పేర్కొన్నారు. కియా పరిశ్రమ ద్వారా రూ.13,500కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అనుబంధ విద్యుత్ కార్ల పరిశ్రమతో మరో రూ.3వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. కియా ద్వారా 11వేల మందికి, అనుబంధ పరిశ్రమల ద్వారా 4వేల మందికి ఉపాధి లభించిందన్నారు. ఏడాదికి సగటున 3 లక్షల కార్ల తయారీ చారిత్రాత్మకమని అన్నారు. మొబైల్ ఫోన్ల తయారీ హబ్‌గా రాష్ట్రాన్ని చేశామన్నారు. దేశంలో తయారయ్యే 10 ఫోన్లలో మూడు ఏపీలోనే అని తెలిపారు. ఇప్పుడు కార్ల తయారీ పరిశ్రమను రాష్ట్రానికి తెచ్చామన్నారు. వైఎస్, బొత్స వోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమను పోగొట్టారని, ముడుపుల కోసం అధికారులను జైలుపాలు చేశారని గుర్తుచేశార. కానీ తాము మాత్రం కియా తెచ్చి తొలి కారును విడుదల చేస్తున్నామన్నారు. అదే టీడీపీకి, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉన్న తేడా అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మొదట గుజరాత్, తమిళనాడును కియా కోసం సిఫారసు చేసిందని, అయితే అవినీతి రహిత రాష్ట్రమనే ఏపీకి కియా వచ్చిందని సీఎం పేర్కొన్నారు.