
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన బీహార్‌లోని ముజఫర్‌పూర్ షెల్టర్‌హోమ్ కేసును ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముజఫర్‌పూర్ షెల్టర్ హోమ్‌లో ఉండే విద్యార్థినులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి, ఆమె భర్తను కూడా పోలీసులు విచారించారు. అయితే ఈ కేసును ఢిల్లీలోని పోక్సో ట్రయల్ కోర్టుకు బదిలీ చేసింది. రెండు వారాల్లోగా విచారణ మొదలు పెట్టి, కేసును ఆర్నెళ్లలో పూర్తి చేయాలని ఆదేశించింది. కేసును విచారించడంలో జాప్యం చేస్తున్న బీహార్ ప్రభుత్వంపై సుప్రీం సీరియస్ అయ్యింది. ఇక జరిగింది చాలు, పిల్లల్ని ఇలా చూడడం సరికాదు అని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసును విచారిస్తున్న ఆఫీసర్‌ను బదిలీ చేయడం పట్ల కూడా సీబీఐని సుప్రీం నిలదీసింది. దీనిపై వివరణ ఇవ్వాలని చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో సమాచారం ఇవ్వని పక్షంలో చీఫ్ సెక్రటరీకి సమన్లు జారీ చేస్తామని కూడా హెచ్చరించారు. ముజఫర్‌పూర్‌లోని ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న షెల్టర్‌హోమ్‌లో ఉన్న 34 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బ్రజేశ్ థాకూర్‌ను అరెస్టు చేశారు.